ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అఖండ మెజారిటీతో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. జగన్ ఐదేళ్ల పాలనకు విసిగిపోయిన ప్రజలు మూకుమ్మడిగా కూటమి వైపు మొగ్గు చూపారు. వైనాట్ 175 అన్న జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఫ్యాన్ రెక్కలు ఊడి పడినా జగన్ మాత్రం తగ్గట్లేదు. రాష్ట్రంలో 2027లోనే ఎన్నికలు రానున్నాయని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదేనని జగన్ అండ్ కో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కానీ మరోసారి జగన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని తేల్చేశారు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు దావోస్లో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దావోస్ లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన పలు పశ్నలకు చంద్రబాబు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
జగన్ మళ్లీ సీఎం అయితే ఏంటి? అని ప్రశ్నించగా.. అందుకు చంద్రబాబు `ఎవరైనే సరే మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి వస్తారు. ప్రతిసారి రాలేరు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా విలువలు ఉండాలి` అని బదులిచ్చారు. పరోక్షంగా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని బాబు తేల్చేశారు.
నారా లోకేశ్ వారసత్వంపై ప్రశ్నించగా.. `వారసత్వం అనేది ఒక అబద్ధం. లోకేష్ రాజకీయాల్లోకి రావడంలో కుటుంబ వారసత్వం లేదు. నిజానికి లోకేష్ కు వ్యాపారం చేయడం చాలా సులభం. కానీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు` అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తమకు రాజకీయాలు ప్రజాసేవ కోసమే తప్ప.. జీవనోపాధి కోసం కాదని.. అందుకే 33 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.