రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు కొత్త నినాదాన్ని తెరపైకి వచ్చారు. కూటమి సర్కార్ కొలువు తీరి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా.. చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ` రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం.
ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి.. ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో…స్వర్ణాంధ్ర – 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెడతాం.` అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
కూటమి రాకతో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఆగిపోయిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ తిరిగి ప్రారంభమైంది. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో మొత్తం 198 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తోంది కూటమి ప్రభుత్వం.
దీపావళి కానుకగా సర్కార్ ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకానికి భారీ స్పందన లభించింది. దీపం 2 పథకం ద్వారా అర్హులందరికీ లాభం చేకూరుతుంది. ఇప్పటికే 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులు బుక్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి రూ. 1000 పెంచి మొత్తం రూ. 4వేలు 1వ తేదీనే ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి రూ. 33 వేల కోట్లు, ఐదేళ్లలో రూ. 1.60 లక్షల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డ్.