ఏపీ అధికార పార్టీ వైసీపీకి హోల్‌సేల్‌గా సెగ మొదలైందా? ఇప్పటి వరకు తమ వాడు అనుకున్న చిరంజీవి చేసిన వ్యాఖ్యల తర్వాత.. వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారా? ఇక, ఇండస్ట్రీ నుంచి తమకు సెగ తప్పదని నిర్ణ యించేసుకున్నారా? అంటే.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ నుంచి వైసీపీకి చిన్న చిన్న హీరోలు, లేదా కమెడియన్ల నుంచి మాత్రమే మద్దతు ఉంది. ప్రధాన పెద్ద హీరోల నుంచి అగ్ర నిర్మాతలంతా కూడా టీడీపీకే జై కొడుతున్నారు.
ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు.. తర్వాత ..ఆయన ఇంటికి వెళ్లి విందు ఆరగించిన విషయాలతో వైసీపీకి చిరు మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రగాఢంగా విశ్వసించారు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడు విమర్శించినా.. మీ అన్నయ్యను చూసి నేర్చుకో! అంటూ కౌంటర్ ఇస్తుంటారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా చిరు ప్లేట్ ఫిరాయించారనే వాదన వినిపిస్తోంది.
తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు… వైసీపీకి ఒకరకంగా భారీ షాక్ ఇచ్చాయని ఇటు రాజకీయ ప్రముఖులు, అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించుకునేందుకు ఇప్పటి కే మెగా ఫ్యామిలీ అభిమానులు డిసైడ్ అయ్యారు. అయితే.. అసలు మెగా స్టార్ నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఈ విషయంలో పెద్దగా సంకేతాలు రాలేదు. అయితే.. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా.. తాము వైసీపీకి వ్యతిరేకమనే సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగుతోంది.
దీంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందనే అంచనాలు వస్తున్నాయి. ఒకవైపు.. టీడీపీ దూకుడు, మరోవైపు.. పవన్ వారాహియాత్రలు, ఇంకోవైపు.. మెగాస్టార్ కూడా.. వైసీపీ వ్యతిరేకమనే ధోరణిని ప్రదర్శించిన దరిమిలా.. వైసీపీకి ముప్పేట దాడి తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇందులో వెనుక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదని.. వైసీపీకి హోల్‌సేల్‌గా వచ్చే ఎన్నికల్లో సెగ తప్పదని చెబుతున్నారు. మరి వైసీపీ ఈ సెగను ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.