మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన పొలిటికల్ రీఎంట్రీ పై సంచలన ప్రకటన చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న చిరంజీవి.. అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దాంతో రాజకీయాలను వీడి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. అయితే గత ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు గెలుపొందారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడమే కాకుండా మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్లో కొనసాగుతున్నారు.
అప్పటినుంచి చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పైగా ఈ మధ్య కాలంలో తరచూ చిరంజీవి పలువురు రాజకీయ పెద్దలను కలుస్తుండటంతో ఆయన త్వరలో పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయంపై చిరంజీవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన `బ్రహ్మా ఆనందం` చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు హైదరాబాద్ లో మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తన రాజకీయ రీఎంట్రీపై రియాక్ట్ అయ్యారు. చిరు మాట్లాడుతూ `నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమా.. జీవితాంతం కళామతల్లి సేవలోనే గడుపుతాను. తాను మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తానేమోనని పలువురు సందేహపడుతున్నారు. కానీ అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. సినీ రంగానికి అవసరమైన అంశాలపై చర్చించేందుకే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను` అని చెప్పుకొచ్చారు. అలాగే రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేశారు.