సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు పలు విషయాలను చర్చించిన తర్వాత చిరు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలను జగన్ కు చిరు వివరించారు. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు పెంచాలని చిరు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు, టాలీవు్డ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ కు చిరు విజ్ఞప్తి చేశారట.
కరోనా సంక్షోభం కారణంగా సినీ కార్మికులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని జగన్ కు చిరు చెప్పారట. సినీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చిరు కోరినట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి ప్రస్తావించిన అన్ని అంశాలను జగన్ నోట్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించేలా చర్చలు, చర్యలు ఉండాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారట.
ఇక, ఈ భేటీకి రావాల్సిందిగా నాగార్జునను చిరంజీవి కోరారట. అయితే, అందుకు నాగ్ నిరాకరించాడట. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో తాను బిజీగా ఉన్నానని, అందుకే రాలేకపోయానని నాగ్ చెప్పారు. జీవో నంబర్ 35 ప్రకారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన రేట్లు తనకు సమ్మతమేనని నాగ్ చెప్పారు. జీవో ప్రకారం టికెట్ రేట్లను క్యాలిక్యులేట్ చేసుకున్నామని, తమకు ధరలు ఓకే అనిపించి ఎట్టి పరిస్థితుల్లోనైనా సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్రమోషన్లు మొదలు పెట్టామని చెప్పారు.