వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చావోరేవో లాంటివి. ఈ సారి గానీ పార్టీని గెలిపించుకోకుంటే రాష్ట్రంలో టీడీపీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశముంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎన్నికల్లో విజయం కోసం బాబు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటన వ్యూహాత్మకంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యటనలోనే ప్రచారం కొనసాగిస్తూ.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కన్ఫార్మ్ చేస్తు బాబు సాగుతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అక్కడి ఇంచార్జీలకు బాబు మార్గనిర్దేశనం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గ ఇంచార్జీలకే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా టికెట్ ఇచ్చే ఇంచార్జీలు ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని బాబు పర్యటిస్తున్నారని తెలిసింది. ఆయన అడుగుపెట్టిన నియోజకవర్గంలో అక్కడి ఇంచార్జీగా ఉన్న నాయకుడికి టికెట్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా అభ్యర్థులను ప్రకటించేస్తూ, గెలిపించండి అని ప్రజలను బాబు కోరుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసుల్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డికి విజయం కట్టబెట్టాలంటూ ప్రజలను బాబు కోరారు. ఇక నంద్యాలకు వెళ్లనున్న ఆయన.. అక్కడ భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరే అవకాశముంది. ఇప్పటికే ఇంచార్జీగా ఉన్న బ్రహ్మానందరెడ్డికి బాబు టికెట్ ఖాయం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ఆళ్లగడ్డ వైపు మాత్రం బాబు కన్నెత్తి చూడడం లేదని తెలిసింది. అక్కడ ఇంచార్జీగా ఉన్న భూమా అఖిల ప్రియ విషయం బాబుకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.