అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లా అండ్ ఆర్డర్ పై సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ క్రమంలోనే గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నాయకుల దాడులు చేసి వారిపై ఎదురు కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు ఆరోపించారు. ఆలయాలపై కూడా దాడులు తీవ్ర స్థాయిలో జరిగాయని, దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం బాధాకరమని, దానికి గత ప్రభుత్వ వైఫల్యం కారణమని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరులపై దాడులు జరిగాయని, తమకు నచ్చని వారిని వేధింపులకు గురి చేసి పార్టీలు మారేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు, సీనియర్ జర్నలిస్టు అంకబాబులను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో వేదించారని గుర్తు చేశారు. అందరూ కాకపోయినా కొందరు పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కై పోలీసు శాఖ పరువు తీశారని చంద్రబాబు అన్నారు.
కొందరు పోలీసు అధికారులు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వీఆర్ లో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పరోక్షంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తనపై గతంలో బాబ్లీ కేసు ఒకటే ఉండేదని, కానీ గత ప్రభుత్వం తనపై 17 కేసులు పెట్టిందని, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60 కేసులు, ధూళిపాళ్ల నరేంద్ర, బీటెక్ రవి లను జైల్లో పెట్టి వేధించారని అన్నారు. ఇక, వైసీపీ ప్రభుత్వం అవమానపరచడం వల్ల కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.