జగన్ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. 2021, అక్టోబరు 19న జరిగిన ఈ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. మరో నాలుగు రోజుల్లో ఈ దాడి ఘటనకు మూడు సంవత్సరాలు నిండుతాయి. అయితే.. ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. దీంతో కూటమి సర్కారు వచ్చాక దూకుడు పెంచింది. ఈ కేసును ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీసులే విచారిస్తున్నారు.
కానీ, రోజు రోజుకు ఈ కేసులో వేగంపెరగాల్సిఉండగా.. ఆలస్యం అవుతోంది. పైగా.. నిందితుల్లో వైసీపీ నాయకులు చాలా మంది బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యానికితోడు.. కేసు విచారణ కూడా నత్తనడకన సాగుతోంది. దీంతో కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలపై తాజాగా సమీక్షించిన ఆయన.. కేసును సాధారణ పోలీసుల నుంచి తప్పించాలని నిర్ణయించారు.
టీడీపీ ఆఫీసు కేసు విచారణను సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణకు సంబంధించిన అన్ని ఫైళ్లను, నిందితుల వివరాలను కూడా సోమవారం సీఐడీకి అప్పగించాలని మంగళగిరి డీఎస్పీని సీఎంవో ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందని.. నిందితుల ను వదల కుండా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి టైం పెట్టకపోవడం గమనార్హం.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు వీరే..
+ దేవినేని అవినాష్
+ లేళ్ల అప్పిరెడ్డి
+ ఆళ్ల రామకృష్ణారెడ్డి
+ మాజీ ఎంపీ నందిగం సురేష్