ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్డీఏలో జనసేన అధికారికంగా చేరడంతో టీడీపీ ఒంటరైంది. ఇక, బీజేపీ-టీడీపీల మధ్య గ్యాప్ ను ఫిల్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన పవన్…వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు. దీంతో, బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా మారుతుందా లేదా అన్నది భేతాళ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులు లేవని ఆయన తేల్చేశారు. ఏపీలో అవసరాలను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదే సమయంలో బిజెపితో తాము అంతర్గతంగా జరుపుతున్న చర్చల సారాంశం ఎవరికీ తెలీదని ఏపీలో బీజేపీతో పొత్తు వ్యవహారంపై చంద్రబాబు పరోక్షంగా హింట్ ఇచ్చారు. దేశ నిర్మాణంలో టీడీపీని భాగస్వామిని చేయడమే తన లక్ష్యమని, అది ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా నేపథ్యంలోనే ఎన్డీఏ నుంచి వైదొలిగానని, ఆ విషయంలో తప్ప మరే విషయంలోనూ కేంద్రంతో విభేదాలు లేవని అన్నారు. ఆ విషయాన్ని గతంలో చాలా సార్లు చెప్పానని వెల్లడించారు.
జాతీయభావంతో ఉండే టీడీపీ ఎల్లపుడూ జాతీయ రాజకీయాలతో అనుబంధం కలిగి ఉంటుందని అన్నారు. ఇక, ఏపీకి జగన్ అతిపెద్ద సమస్య అని, విభజన గాయం కంటే ఏపీకి జగన్ పాలన వల్ల కలిగిన గాయం పెద్దదని విమర్శించారు. జగన్ ఓడిపోతేనే ఏపీ బాగుపడుతుందని, జగన్ వల్లే ఆంధ్రా అభివృద్ధి తెలంగాణ మాదిరి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తాను గేట్లు తెరిస్తే వైసీపీ నేతలలో చాలామంది టీడీపీలో చేరతారని హెచ్చరించారు.