ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన చంద్రబాబు పొత్తులపైనే చర్చలు జరిపారని, త్వరలోనే పొత్తులపై తుది నిర్ణయం వెలువడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించిన విషయం విదితమే. పొత్తులపై ప్రచారం చేస్తున్నవారినే దాని గురించి అడగాలని చంద్రబాబు అన్నారు.
అయితే, ఆ వ్యాఖ్యలను కొందరు వేరేరకంగా అర్థం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో, పొత్తులపై చంద్రబాబు తాజాగా స్వయంగా మరోసారి స్పష్టతనిచ్చారు. ఇతర పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం గురించి తాను ఇప్పటిదాకా మాట్లాడలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమయం,సందర్భం, అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని క్లారిటీనిచ్చారు.
పొత్తుల గురించి కొన్ని పేపర్లలో కథనాలు రాస్తున్నారని, కానీ, ఆ కథనాలపై తాను స్పందించడం బాగుండదని చెప్పుకొచ్చారు. అయితే, పొత్తుల విషయంలో తన నిర్ణయం ఏమిటన్నదానిపై పార్టీ నేతలకు స్పష్టత ఉండాలని చెప్పారు. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలా చేయడం వల్ల పార్టీ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు.
ఎన్నికలు త్వరగా వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని జగన్ పై విమర్శలు గుప్పించారు. నెత్తిన ఉన్న కుంపటిని ఎప్పుడెప్పుడు దింపుకుందామా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పోరాడే నేతలు చాలామంది తయారు కావాల్సి ఉందని, పార్టీలోని సీనియర్లు వారిని తయారు చేసే బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments 1