అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రం కోసం దేనినీ లెక్క చేయనని, బాంబులకే భయపడని తాను వైసిపి బెదిరింపులకు భయపడతానా అని చంద్రబాబు ప్రశ్నించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి జగన్ ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. 114 చెరువులకు నీళ్లు ఇచ్చే భైరవానితిప్ప ప్రాజెక్టును జగన్ నాశనం చేశాడని ఆరోపించారు. ఇరిగేషన్ కోసం 12 వేల కోట్లు రాయలసీమకు తాము ఖర్చు చేశామని, జగన్ 2000 కోట్లు ఇచ్చాడని అన్నారు.
రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్రంలో 1092 ప్రాజెక్టులు రద్దు చేశాడని, జగన్ రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవాను అన్నగారు ప్రారంభిస్తే తాను పూర్తి చేశానని, గొల్లపల్లి ప్రాజెక్టును సవాల్ గా తీసుకొని పూర్తి చేశానని చెప్పారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ తెచ్చామని, 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించానని అన్నారు. జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలని పిలుపునిచ్చారు. ఆనాడు ముద్దులు పెట్టిన జగన్ ఈనాడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని చురకలంటించారు. ఈ ప్రభుత్వం బాగా చేసిందని, తమ ఆదాయం పెరిగిందని ఎవరైనా చెబితే ఇక తాను మాట్లాడను కూడా మాట్లాడనని సవాల్ విసిరారు.
గురువు కంటే గూగుల్ గొప్ప అని దద్దమ్మ మంత్రి అంటున్నాడని ఆదిమూలపు సురేష్ కు చురకలంటించారు. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆదరణ ద్వారా పనిముట్లు కూడా ఈ సైకో పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఓ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశాడని, దళిత పథకాలను తీసేసిన దుర్మార్గ పార్టీ వైసిపి అని దుయ్యబట్టారు. మద్యనిషేధం చేయకుంటే ఓట్లు అడగను అని గొప్పలు చెప్పిన జగన్ క్వార్టర్ బాటిల్ ధరను రూ.60 నుంచి రూ.200కు పెంచాడని ఆరోపించారు. తోపుడుబండ్లలో కూడా ఫోన్ పే ఉంటుందని, కానీ మద్యం షాప్ లో మాత్రం ఫోన్ పే ఉండదని దుయ్యబట్టారు. డీజిల్, పెట్రోల్ రేట్లు, కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచిన జగన్ ను ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.