ఆంధ్రుల రాజధాని అమరావతి సాధన ఉద్యమానికి ఏడాది పూర్తయ్యింది. అలుపెరగని పోరాటం చేసిన రైతులకు మద్దతుగా ఏపీ రాజకీయ పార్టీలు ఈరోజు జరుగుతున్న బహిరంగ సభకు హాజరవుతున్నాయి. అమరావతి ఉద్యమ సభకు హాజరు కావడానికి ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి వెళ్లారు.
వెలగపూడి వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు వాహనాలను ముందుకు కదలనివ్వలేదు. ఉద్దండరాయునిపాలెం నుంచి ఉద్యమం జరుగుతున్న గ్రామాల మీదుగా రాయపూడి బహిరంగ సభ ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో అమరావతి రైతులు, తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు చివరకు చంద్రబాబును పంపించారు.
దీంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలేనికి వెళ్లి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి శిలాఫలకాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాయపూడిలో జరుగుతోన్న జనభేరి సభకు బయలుదేరారు. అమరావతికి వెళ్లడానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతియే శాశ్వత రాజధానిగా ఉండాలని పూజలు చేయించారు.