ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం పెట్టారు. ఈ ఏడాది జూన్‌లోగా రాష్ట్రంలో మిగిలిన 1300లకు పైగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. వీటిలో 214 మార్కెట్ కమిటీలు, 1100లకు పైగా ట్రస్టు బోర్డులు ఉన్నాయి. వీటిలో చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయా పదవుల ప్రాధమిక కాలం రెండు సంవత్సరాలు. అయితే.. ఇప్పటి వరకు నాయకులను వరుసగా తదుపరి ప్రభుత్వం ఉన్నంత వరకు కొనసాగిస్తు న్నారు.
ఎమ్మెల్యేలకు బాధ్యతలు..
క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు తెరదీసిన చంద్రబాబు.. ఏయే పదవులకు ఎవరిని ఎంపిక చేయాలన్న బాధ్యతలను మాత్రం ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ పదవులను ఎంచుకునే బాధ్యతను ఎమ్మెల్యేలే తీసుకోవాలని ఆయన సూచించారు. స్థానికంగా పార్టీకి బలంగా ఉన్న నాయకులు, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారు. గత ఏడాది ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేసిన వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇదేసమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మూడో ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు తెగేసి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని గుర్తించాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. అందుకే తొలి ప్రాధాన్యం, మలి ప్రాధాన్యం కూడా సొంత నేతలకే ఇవ్వాలన్నారు.
ఇవీ కొలమానాలు..
నామినేటెడ్ పదవులు పొందేందుకు కొన్నికొలమానాలను కూడా చంద్రబాబు వివరించారు. నాలుగు రకాల లక్షణాలు ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. బూత్ లెవిల్లో బాగా పనిచేసినవారు, సెక్షన్ స్థాయిలో పార్టీ కోసం కృషి చేసినవారు, క్లస్టర్ స్థాయిలో పార్టీని నడిపించిన వారిని ఎంపిక చేయాలన్నారు. అదేవిధంగా గత ఏడాది ఎన్నికలకు ముందు చేసిన కృషిని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఇన్ని పదవులు ఇస్తున్న నేపథ్యంలో ఇకపై ఎవరూ అంసతృప్తిగా ఉండడానికి వీల్లదని తేల్చి చెప్పారు. పార్టీ విధానాలతో పాటు.. కూటమి సర్కారు విధానాలను కూడా ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు.