టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా విజయనగరంలోని పోలిపల్లిలో యువగళం-నవశకం బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు….ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని యువగళాన్ని ఆపాలని సైకో జగన్ దండయాత్ర చేశాడని మండిపడ్డారు. తమకు రాజకీయ వ్యతిరేకత ఉండే అవకాశం ఉందని, కానీ వ్యక్తిగత వ్యతిరేక లేదని చంద్రబాబు క్లారిటీనిచ్చారు. జగన్ కు కక్ష సాధించడమే పని అని, విధ్వంసకర పాలన చేయడమే తెలుసు అని ఎద్దేవా చేశారు.
ఒక్క ఛాన్స్ జగన్ కు ప్రజలు ఇవ్వడంతో 30 ఏళ్లు రాష్ట్రం వెనక్కి వెళ్లిందని అన్నారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ 500 కోట్లతో విలాసవంతమైన భవనాలను నిర్మించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడని విమర్శించారు. ఇక, టీడీపీ-జనసేన పార్టీ పొత్తు చరిత్రాత్మక నిర్ణయం అని, రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్న జగన్ ముఖ్యమంత్రిని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
ఏపీలో టీడీపీ, జనసేన ఓట్ల తొలగింపునకు వైసీపీ శ్రీకారం చుట్టిందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెలకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి రెండు సభలు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఆ సభలలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సూపర్ సిక్స్ టైపులో పథకాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు.