‘‘హమ్మయ్య! చంద్రబాబు మారారు… గ్రేట్’’
తాజాగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు చెబుతున్న మాట ఇది. అంతకాదు.. సోషల్ మీడియాలోనూ దీనినే వైరల్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? చంద్రబా బులో అంత మార్పు ఏంటి? అసలు విషయం ఏంటి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఆయన తన లోని లోపాలను బయట పెట్టారు. నిర్మొహమాటంగా ఆయన తన మనసులో మాటలను వ్యక్తీకరించారు. పార్టీలో ఉన్న లోపాలను.. ఈ విషయంలో తాను వ్యవహరించిన తీరును ఆయన కుండబద్దలు కొట్టారు.
‘‘గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించడం వల్ల కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపో యాను. మిమ్మల్ని పట్టించుకోలేక పోయాను. ఇకపై అలా ఎన్నటికీ జరగబోదు. నేను మీవెంటే ఉంటాను.“ అని చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలనే టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని నిరాశలో కూరుకుపోయిన వారికి ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. అంతేకాదు.. వైసీపీ సర్కారు అరాచకాలపైనా చంద్రబాబు స్పందించిన తీరుకు కార్యకర్తలు ఫిదా అవుతున్నారు.
“అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తా. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తా. కుప్పం కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతా“ అని చంద్రబాబు హామీ ఇచ్చిన తీరు కార్యకర్తలను మురిపిస్తుండడం గమనార్హం.
అంతేకాదు.. ‘‘ నా సమయంలో 25 శాతం కార్యకర్తల కోసం వెచ్చించి ఉంటే మనకీ ఇబ్బందులు వచ్చేవి కాదు. పొరపాటు జరిగింది. భవిష్యత్లో ఇలా జరగదని స్పష్టం చేస్తున్నా. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదు. మీకు అండగా ఉంటా. తప్పకుండా ఏం చేయాలో చేద్దాం. గతాన్ని తలచుకుంటే ముందుకెళ్ల లేం. పార్టీ ఇబ్బందుల్లో ఉంటే మనల్ని మనం విమర్శించుకుంటే బలహీనమవుతాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది“ అని కార్యకర్తల్లో చంద్రబాబు నూతనోత్తేజం కలిగించేలా చేసిన వ్యాఖ్యలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. మరి ఈ ఫలితం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల.