సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ చివరిసారిగా ఏపీలో పర్యటించిన సంగతి తెలసిందే. విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్ లతో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. 29 ఏసీ కోర్టుల హాళ్లు, వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, లిఫ్టులు సహా అన్ని అధునాతన సదుపాయాలతో ఈ భవనాలను నిర్మించారు.
ఈ క్రమంలోనే విజయవాడ నోవోటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు వారి భేటీ సాగింది. ఇక, ఈ రోజే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు డాక్టరేట్ లభించనుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏఎన్‌యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత ఏఎన్‌యూ యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరిరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మంగళగిరి సీకే కన్వెన్షన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ విందులో జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నెలాఖరులోపు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో చంద్రబాబు భేటీ అయ్యారు. జగన్, భారతిలు వెళ్లిన వెంటనే సీజేఐతో చంద్రబాబు ఇరవై నిమిషాల సేపు భేటీ అయ్యారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏపీకి వచ్చినపుడు సీఎం జగన్ పట్టించుకోలేదు. రెండో సారి వచ్చినప్పుడు భారీగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఆ సమయంలో సీజేఐని చంద్రబాబు మాత్రం కలవలేదు. కానీ, ఈ సారి కలిశారు.