టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా..? అని నిలదీశారు.
రోడ్ల గుంతలకు గంపెడు మట్టి వేయని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడుతానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఘాటుగా చంద్రబాబు స్పందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
“తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే ఏమని చెబుతారు“ అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ, రైతులు ఇచ్చిన భూములు కలిపి 50వేల ఎకరాలు ఉన్నాయన్నారు. అన్ని నిర్మాణాలు పోనూ 10వేల ఎకరాలు మిగులుతాయని, ఎకరా రూ.10 కోట్లయినా లక్ష కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రూ.30 కోట్లు అయితే.. మూడు లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. ఈ పవిత్రమైన ఆస్తిని జగన్ విధ్వంసం చేశాడని నిప్పులు చెరిగారు.
విశాఖలో భూములు ఆక్రమించాలనే దురుద్దేశంతో అమరావతిని విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 2020లో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని చేయాలనుకున్నామని చెప్పారు. “హైదరాబాదును అభివృద్ధి నేనే చేశా. ప్రపంచ దేశాల్లో అద్భుత శక్తిగా నిలిచింది. అక్కడ దుర్మార్గులు ఎవరూ రాలేదు. ఎవరూ విధ్వంసం చేయలేదు. హైదరాబాదును ముందుకు తీసుకెళ్లారు. అందుకే ప్రపంచ పఠంలో కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది“ అని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాదు అభివృద్ధి అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌ను కూడా మహోన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రణాళికలు సిద్ధం చేశానన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2029 నాటికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండేదని తెలిపారు. “ఒక్క ఛాన్స్ అని జగన్ వచ్చాడు. మీకు ముద్దులు పెట్టాడు… ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. మన జీవితాలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు“ అని బాబు ఆరోపించారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు వేస్తే సహించేది లేదన్నారు. “ప్రతి కార్యకర్తకు హామీ ఇస్తున్నా. మీ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డు వేసి కాపాడుకుంటా… వైసీపీ గుండాలకు రౌడీలకు భయపడే ప్రసక్తే లేదు“ అని ధీమా వ్యక్తం చేశారు.
పత్తికొండ ???????? pic.twitter.com/rnNT7u825G
— iTDP Official (@iTDP_Official) November 16, 2022