చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబు ఎప్పుడు వెనకడుగు వేస్తుంటారన్న విమర్శ దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీలో వినిపించేదే. ఎవరెంత చేసినా.. వారి కారణంగా పార్టీకి మరెంత డ్యామేజ్ అవుతున్నా.. వారిపై చర్యలు తీసుకునే విషయంలో అంతులేని ఆలస్యాన్ని ప్రదర్శిస్తుంటారన్న విమర్శ ఆయన మీద ఉంది. షాకింగ్ నిర్ణయాల్ని తీసుకునే అలవాటు చంద్రబాబులో ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.అయితే.. ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా మారిపోయారని.. గతానికి భిన్నంగా ఆయన తీరు ఉంటుందన్న వాదనకు బలం చేకూరేలా తాజా పరిణామం చోటు చేసుకుంది.
లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేయటం చూసినప్పుడు.. బాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విషయం స్పష్టమవుతుంది. సత్యవేడు ఎమ్మెల్యే తనను మానసికంగా.. శారీరకంగా వేధిస్తున్నారంటూ పార్టీకి చెందిన మహిళా నేత ఒకరు హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో సంచలన ప్రెస్ మీట్ పెట్టటం.. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో క్లిప్పులు మరింత షాక్ కు గురి చేశాయి.
ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారున ఒక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు రావటం.. వచ్చిన గంటల వ్యవధిలో (రెండు నుంచి నాలుగు గంటల వ్యవధిలోనే) చర్యల్ని పార్టీ ప్రకటించటం చూస్తే.. చంద్రబాబు ఎంత మారిపోయారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక కీలక హెచ్చరిక చేవారు. రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తన వరకు వస్తే.. వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రతి విషయంలోనూ తాను ఎంతో మారిపోయానని చెప్పేలా చేస్తున్న చంద్రబాబులో మార్పు ఇంత ఎక్కువగా ఉందన్న విషయం తెలుగు తమ్ముళ్లకు తొలిసారి అర్థమైందన్న మాట వినిపిస్తోంది.