టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన ఇంటిపై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయిలో చూపించేందుకు రెడీ అయ్యారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ఇంటిపైనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి రావడం.. సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు.. వాస్తవానికి ఇప్పటి వరకు దీనిపై నోరు విప్పి మీడియాతో మాట్లాడిందిలేదు.
ఎందుకో.. ఆయన చాలా మౌనంగా ఉన్నారు. అయితే.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాత్రం ఈ ఘటన తీవ్ర పొలిటికల్ వార్‌కు కారణమైంది. అయితే.. ఇంతలోనే పవన్ వర్సెస్ పేర్ని ఎపిసోడ్ రావడంతో.. ఇప్పుడు.. బాబు ఘటన వెనక్కి వెళ్లింది.
అయితే.. బాబు మాత్రం దీనిని వదిలి పెట్టలేదు. ఈ విషయాన్ని జాతీయస్థాయిలో తీసుకువెళ్లి.. రాష్ట్రపతి నుంచి ప్రధాన మంత్రి వరకు అందరినీ తట్టిలేపి.. ఏపీవైపు చూసేలా చేస్తున్నారు. దీనికి సంబంధించి బాగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు.
తన ఇంటిపై జరిగిన దాడిని ఆయన.. జాతీయ ఉద్యమంగా మార్చుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కొన్ని తీర్మానాలు చేసి.. వాటిని లేఖల రూపంలో.. టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో ఢిల్లీకి కోటి ఉత్తరాలు పంపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
దీనిని చూసి.. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు.. ఏపీలోని జగన్ సర్కారుపై చర్య లు తీసుకోవాలనేది.. చంద్రబాబు ఉద్దేశం. అంతేకాదు.. ఏపీలో శాంతి భద్రతలు మృగ్యమయ్యాయని.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా భద్రత కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని.. పైగా.. పోలీసులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని.. అసలు ఘటన జరిగిన వెంటనే అసలు ఏమీ జరగలేదన్నట్టు.. డీఐజీ స్థాయి అధికారి వ్యాఖ్యానించడం.. టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. తిరిగి వారిపైనే కేసులు పెట్టడం.. వంటి అంశాలను..చంద్రబాబు జాతీయస్థాయిలో ఫోకస్ చేయనున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా.. తీర్మానాలను ఆమోదిస్తూ.. లేఖలను సిద్ధం చేస్తున్నారు. ఆ వెంటనే స్వయంగా లేదా.. తన పార్టీ ఎంపీల ద్వారా ఈ లేఖలను రాష్ట్రపతి, ప్రధానికి అందించనున్నారు. మరి బాబు వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.