చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి జరిగింద. బూరుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో అంతా టెన్షన్ పడ్డారు. ఆ కారు గుద్దడంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ వంగిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ చంద్రబాబుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తెలుగుతమ్ముళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు.
అంతకుముందు, ‘ఇదేం ఖర్మ మన రాష్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..జగన్ పై నిప్పులు చెరిగారు. జగ్గంపేటలో జననేత చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. భారీ వాహన శ్రేణితో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి జగ్గంపేట రోడ్ కు టీడీపీ అధినేత తరలివెళ్లారు. అక్కడ తనకు స్వాగతం పలికిన మహిళలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మహిళల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ టీడీపీ అని, మహిళలకు ఆస్తి హక్కు, విద్యారంగంలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని గుర్తు చేశారు.
మహిళల కోసం పద్మావతీ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్ అని, డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించింది టీడీపీ అని చంద్రబాబు అన్నారు. పురుషులకంటే ఎక్కువ సంపాదిస్తున్నారని, అదీ మహిళా శక్తి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం పన్నులతో ప్రజలను బాదేస్తుందని, అది చూస్తే తనకు బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై 45 రకాల పన్నులను జగన్ ప్రభుత్వం మోపిందని మండిపడ్డారు.
సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి 50 రూపాయలు కాజేస్తున్న చెత్త ప్రభుత్వం ఇదని ఫైర్ అయ్యారు. జగన్ ఓ రంగుల పిచ్చోడని, ప్రతి దానికీ తన పార్టీ రంగులు వేసుకుంటాడని ఎద్దేవా చేశారు. మౌనంగా ఉంటే జనం మొహాలకూ రంగులు వేస్తాడని, జనం భూములు సర్వే చేసి…జగన్ బొమ్మలు వేసుకుంటున్నాడని చురకలంటించారు. ఇళ్లపై ‘నువ్వే మా నమ్మకం’ అని స్టిక్కర్ లు వేస్తాడట అని సెటైర్లు వేశారు. సైకో జగన్ ను ఇంటికి పంపుదాం…సైకిల్ ను అధికారంలోకి తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు.