జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిజం రక్కసి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉన్న పల్లెలు కూడా జగన్ పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ బారిన పడి విలవిలలాడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం…ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేసిన వైనం సంచలనం రేపుతోంది.
బుద్ధా వెంకన్న కారుపై మాచర్లలో దాడి ఘటన, మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, అక్కడి ఉద్రిక్త పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మాచర్లలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు రాజుకున్నాయి. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు కత్తులు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డాయి. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై కత్తులతో విచక్షణారహితంగా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆ దాడి ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆ దాడి ఘటనను చంద్రబాబు ఖండించారు. మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి గురించి స్థానిక నేతలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా స్థాయి టీడీపీ నేతలను ఆదేశించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ గూండాలు గంటల తరబడి మారణహోమం సృష్టిస్తున్నా పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇది పోలీసుల వైఫల్యం అని, వైసీపీ కార్యకర్తలు,నేతలకు పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపించారు.