ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాలుగు విడతలుగా జరిగిన పోలింగ్ లో వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలు, ఓటర్లను ప్రలోభపెట్టడం, కౌంటింగ్ లో గోల్ మాల్, ఫలితాల తారుమారు వంటి కార్యక్రమాలకు అధికార పార్టీ తెరతీసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ చేసిన వైసీపీ మాత్రం….పంచాయతీ ఎన్నికల్లో తమదే మెజారిటీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నాలుగో దశలో గెలిచిన వైసీపీయేతర అభ్యర్థులను ప్రకటించడం లేదని, ఫలితాలు తారుమారు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి 2 లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు రాత్రి 10గంటలకూ 40శాతం ఫలితాలు ప్రకటించలేదని, టీడీపీ మద్దతు అభ్యర్థులకు మూడంకెల మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్ చేశారని ఆరోపించారు.
వైసీపీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారని, అది ఫలితాలపై ప్రభావం చూపిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీకి అనేకసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. గత 3 దశలతో పాటు 4వ విడతలోనూ ఆ తరహా ఘటనలే వెలుగుచూశాయని మండిపడ్డారు. చీకటిలో ఫలితాల తారుమారులో పోలీసులు, అధికారులు వైసీపీకి అనుకూలంగా మారారని, కౌంటింగ్ వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదని ఆరోపించారు.
విశాఖ జిల్లా పెదనగమయ్యపాలెంలో లైట్లు ఆపేసి, వైసీపీ మద్దతు అభ్యర్థికి అనుకూల ప్రకటన చేశారని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా పుసులూరులో ప్రతిపక్షాల మద్దతుదారుడు 9ఓట్ల మెజారిటీతో గెలిచినా, అర్ధరాత్రి వరకు ఫలితం ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మరి, చంద్రబాబు లేఖపై ఎస్ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.