కీలక నిర్ణయాన్ని వెనువెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఆలస్యం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ స్కాం ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు ను రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచటం తెలిసిందే. ఇప్పటికే నెలకు పైనే ఆయన ఉంటున్నారు. జైల్లో ఉన్న బాబును పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తీవ్ర భావోద్వేగానికి గురై.. జైలు ఆవరణ బయట టీడీపీతో తాను పొత్తు పెట్టుకుంటానని.. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని.. అధికార వైసీపీ చేతికి పవర్ లేకుండా చేయటమే తన లక్ష్యమని చెప్పారు.
జనసేన అధినేత నోటి నుంచి ఈ తరహా మాటలు వచ్చి నెల గడుస్తున్నా.. పొత్తులో భాగంగా రెండు పార్టీల మధ్య సమన్వయం.. సంయమనం చేసుకోవటానికి వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. నిజానికి పొత్తు మాట వచ్చినంతనే..ఇరు పార్టీలు ఒక్కో కమిటీని వేసి.. రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గించుకునే కసరత్తు చేస్తారు. కానీ.. ఇప్పటివరకు అలాంటిది జరగలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
రెండు పార్టీల మధ్య సమన్వయానికి ఒక కమిటీ ఏర్పాటులో ఇంత ఆలస్యమా? అన్న దానికి బదులుగా తాజాగా టీడీపీ అధినేత ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా పార్టీ పేర్కొంది. అందులో అచ్చెన్నాయుడు.. యనమల రామక్రిష్ణుడు.. పయ్యావుల కేశవ్.. పితాని సత్యానారాయణ.. తంగిరాల సౌమ్యలను సభ్యులుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు.. జనసేన పొత్తు విషయంలోనూ చంద్రబాబు పలు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పార్టీల మధ్య సమన్వయానికి ఏర్పాటు చేయాల్సిన కమిటీ విషయంలో ఇంత ఆలస్యమా? అన్నది ప్రశ్నగా మారింది. తాజా కమిటీ ఏర్పాటుతో ఈ రెండు పార్టీలు కలిసి అధికారపార్టీపై ఆందోళనలు చేపడతాయని చెబుతున్నారు. మరి.. జనసేన తన కమిటీని ఎవరితో నియమిస్తారు? అన్నది మరో ప్రశ్నగా మారింది. దీనికి మరెంత కాలం తీసుకుంటారో?