విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గాంధీపై వైసీపీకి చెందిన వ్యక్తులే దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. గాంధీపై జరిగిన దాడిలో ఆయన కన్ను పాక్షికంగా దెబ్బతినడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కారుకు పోలీసులు వంతపాడుతున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే పోలీసుల తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా గాంధీపై దాడి చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ రావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారి రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించినా సరే పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గాంధీ కన్ను పొడిచినా స్టేషన్ బెయిల్ ఇచ్చారని, కానీ, నినాదాలు చేసినందుకే టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోకడలతో రాష్ట్రంలో పోలీసు అధికారులు తామేంటో, తమ శాఖ తీరేంటో, తాము ఎటువైపో స్పష్టంగా చెప్పకనే చెప్పారని నిప్పులు చెరిగారు..
కుప్పంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న టీడీపీ నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారని, గాంధీ విషయంలో వేరుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ రెండు ఘటనల్లో ఖాకీలు వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయనిమచ్చ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు మరీ ఇంతలా సాగిలపడడాన్ని ప్రజలు ఎవరూ ఆమోదించరని హితవు పలికారు.
ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోవడానికి ఈ ఘటన చాలని అన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునేది నిందితులను రక్షించేందుకు కాదని, చట్టప్రకారం పనిచేయడానికని పోలీసులకు చంద్రబాబు హితవు పలికారు.