ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వేగవంతమైన అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక సహాకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ కి కేంద్రం నుంచి మరో వరం వెలువడింది. అమరావతిలో 500 పడకల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సెకండరీ కేర్ హాస్పిటల్, 150 పడకలతో సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేసిన ప్రయత్నాలు ఫలితాయి.
ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ విభజన తర్వాత ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణకు వెళ్లిపోయింది. ఏపీలో ఇప్పుడు ఆ స్థాయి ఆసుపత్రి లేదు. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతిలో కొత్తది ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించగా.. కేంద్రం సానుకూలంగా స్పందించింది.
హైదరాబాద్‌లో నిర్మించినట్లే అమరావతిలో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈఎస్ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి 10 ఎకరాలు, ఎంసీఐ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 25 ఎకరాలు అందుబాటులో ఉండాలి. ఈ మేరకు భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఆస్పత్రి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈఎస్ఐ కార్పొరేషన్‌కు అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు ఉండదని అంటున్నారు.