ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్.. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ పర్మిషన్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.
నేడు జగన్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. అయితే జగన్ అభ్యర్థనను తిరస్కరించాలని, విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దంటూ కోర్టును సీబీఐ కోరింది. జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది.
కాగా, అక్రమాస్తుల కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం విదేశీ పర్యటనకు అనుమతినివ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫారెన్ లో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా.. యూకే, స్వీడన్, యూఎస్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి పర్మిషన్ అడిగారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం.. ఈనెల 30న తీర్పు వెలువరించనుంది.