ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ నెల 25న తదుపరి విచారణ జరగనుంది. దాదాపుగా అదే రోజు తీర్పు వచ్చే అవకాశమూ ఉందని తెలుస్తోంది. మరోవైపు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ….నాంపల్లి సీబీఐ కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికిచ్చిన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 10న విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ జరపనున్న నేపధ్యంలో విజయసాయి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ ఈ నెల 3న పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యసభ ఎంపీ హోదాలో కేంద్ర మంత్రులతో తనకు పరిచయాలున్నాయని చెబుతూ సాక్షులను విజయసాయి ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. సాయిరెడ్డి సాక్షులను భయపెడుతున్నారని పిటిషన్ లో రఘురామ పేర్కొన్నారు. జగన్ తన సీఎం పదవిని, విజయసాయి తన ఎంపీ పదవిని అడ్డుపెట్టుకొని సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణాల వల్ల విజయసాయి బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టును రఘురామ ఆశ్రయించారు. మరి, కోర్టు ఆదేశాల ప్రకారం విజయసాయి కౌంటర్ దాఖలు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.