ఎన్440కే వైరస్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంక్షేమం కోసం ఇలా చేసిన పాపానికి 40 ఏళ్ల అనుభవమున్న సీనియర్ పొలిటిషన్ ను ఏపీ ప్రభుత్వం కేసులతో సత్కరించిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే, చంద్రబాబు తరహాలోనే మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఎన్ 440కే వైరస్ ప్రమాదకరని వ్యాఖ్యానించినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనప్పుడు అప్పలరాజుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎన్-440కె వైరస్ కర్నూలులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఆ వైరస్ ప్రమాదకరమైందని మంత్రి ఓ డిబేట్లో చెప్పారని రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు…హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతవరకు పోలీసులు చంద్రబాబు నివాసానికి రాలేదని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఒక టీమ్ కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్‌లో మకాం వేసిందని ప్రచారం జరుగుతోంది. వారు డీజీపీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు, చంద్రబాబు ఇంటివద్ద సెక్యూరిటీ సిబ్బందికి కోవిడ్ వచ్చిందున ఎవరినీ లోపలికి రానివ్వరని, ఒకవేళ కర్నూలు పోలీసులు వచ్చినా ఇంటికి నోటీసులు అంటించి వెళ్లాల్సిందేనని తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబుకు నోటీసులిస్తే అప్పలరాజుకూ నోటీసులివ్వాల్సి వస్తుందన్న కారణంతోనే పోలీసులు చంద్రబాబు నివాసానికి వెళ్లలేదని తెలుస్తోంది.
చంద్రబాబు కేసు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించకపోవడం కూడా ఈ వాదనలకు ఊతమిస్తోంది. కోవిడ్ కర్ఫ్యూపై మాట్లాడిన డీజీపీ చంద్రబాబు కేసు విషయంపై ప్రశ్నను దాటవేశారు. ఇప్పుడు రాజకీయాలు వద్దని, కోవిడ్ నియంత్రణే ముఖ్యమని అన్నారు. దీంతో, మంత్రి అప్పలరాజుపై కూడా కేసు నమోదు చేస్తారా…నోటీసులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.