త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వ శక్తులూ ఒడ్డుతున్న సంగతి తెలిసిందే. తమిళనాట అమ్మ హవాను కొనసాగించేలా మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని అన్నాడీఎంకే ఆరాటపడుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దల అండతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఎం పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు.
ఇక, తమిళనాటు ట్రెండ్ కు విరుద్ధంగా 2 సార్లు ప్రతిపక్షానికి పరిమితమైన డీఎంకే…ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకొని దివంగత నేత కరుణానిధికి ఘన నివాళి అర్పించాలని భావిస్తోంది. మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో మార్పు తేవాలని, ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఆకాంక్షతో గెలుపు కోసం మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రచార వాహనంపై శ్రీరాముడు, సీతాదేవి వేషధారులను కమల్ నిలబెట్టడం వివాదాస్పదమైంది. వీరిద్దరూ హిందూ దేవుళ్లేనని, వీరిని అడ్డు పెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని రామపురంలోని రామర్ ఆలయం ముందు కమల్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
దీంతో, కమల్ హిందూ దేవుళ్లను అవమానించేలా ప్రచారం చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని స్వతంత్ర అభ్యర్థి పళనికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కమల్, తదితరులపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123 (3) మరియు 125 కింద కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల క్రితం కమల్ చేసిన ప్రసంగంపై బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రాధా రవి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.