విశాఖలో ఆ పెళ్లి గురించి తెలిసినోళ్లంతా అయ్యో అనుకోకుండా ఉండలేరు. చూడచక్కని జంట.. మరికాసేపట్లో వారి పెళ్లి జరగనుంది. అక్కడి వాతావరణం అంతా హుషారుగా ఉంది. నూతన వధూవరుల్ని ఆశీర్వదించేందుకు బంధువులు.. స్నేహితులు.. అందరూ క్యూ కడుతున్నారు.
వరుస ఫోటోలతో ఫోటో గ్రాఫర్లు హడావుడి అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళలో.. సరిగ్గా వధువు నెత్తిన వరుడు జీలకర్ర బెల్లం పెట్టిన వేళలో.. అందరూ ఆక్షింతలు వేసేందుకు ముందుకు వచ్చిన వేళ.. అనుకోని పరిణామం చోటు చేసుకుంది. అప్పటివరకు ఉన్న ఉత్సాహ వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయేలా.. వధువు కుప్పకూలిపోయింది. కాసేపటికే తుదిశ్వాస విడిచిన వైనం షాకింగ్ గా మారింది.
విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ విషాద వివాహం గురించిన వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. విశాఖపట్నంలోని మధురవాడలో ఒక వివాహ వేడుక జరుగుతోంది. వధువు పేరు సృజన కాగా.. వరుడి పేరు శివాజీ. వారిద్దరి పెళ్లి బుధవారం రాత్రి ఏడు గంటల వేళలో జరగాల్సి ఉంది.
దీనికి ముందుగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు నవ్వులతో ఉత్సాహభరితంగా వాతావరణం ఉంది. పెళ్లి కుమార్తె.. పెళ్లి కుమారుడి జంట కూడా చూడముచ్చటగా ఉందని అందరూ అనుకునే వేళలో వారి పెళ్లి మహోత్సవం మొదలైంది. సరిగ్గా పెళ్లి కుమార్తె నెత్తి మీద పెళ్లి కుమారుడు జీలకర్ర.. బెల్లం ముద్దను పెట్టే వేళలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో షాక్ తిన్న వారంతా వెంటనే.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతున్న నవ వధువు.. మరణించినట్లుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే.. పెళ్లి కుమార్తె అంత హటాత్తుగా మరణించటానికి కారణం ఏమిటి? అంత చిన్న వయసులోనే అంత పెద్ద కష్టం ఆమెకు ఎందుకు వచ్చిందన్నది తేలాల్సి ఉంది.
తాజాగా బయటకు వచ్చిన వధువు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చూస్తే.. పెళ్లి కుమార్తె విషం సేవించటం వల్లే ఇలా జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. వధువు విషాన్ని ఎందుకు తీసుకుంది? దానికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే విషాదంగా మారిన పెళ్లింట.. పెళ్లి కుమార్తె విషం తాగటం వల్ల మరణించిందన్న విషయం బయటకు రావటంతో.. అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసుల దర్యాప్తులో వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.