ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కోటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ తమవేనంటూ ఒడిశా సర్కార్ వితండ వాదం చేస్తోంది. ఆ గ్రామాల్లోకి ఆంధ్రా అధికారులు రాకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలతో ఒడిశా అధికారులు దడి కట్టారు. వందలాదిమంది పోలీసులను మోహరించి ఆ గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఆ గ్రామాల్లోని ప్రజలను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆ గ్రామాలను సందర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరను స్థానికులు అడ్డుకున్నారు. రాజన్న దొర గో బ్యాక్ అంటూ స్థానికులు నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆంధ్రా పోలీసులు సరిపడినంత సంఖ్యలో లేకపోవడంతో గ్రామాల్లోకి వెళ్లడానికి ఆంధ్రా అధికారులు, ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు. ఆ 34 కొఠియా గ్రామాలను ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఒడిశా సర్కార్ ప్లాన్ వేస్తోంది. ఆ గ్రామాల్లో అసలు ఏపీ ఆనవాళ్లనే లేకుండా కుట్ర చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్డును ఒడిశా అధికారులు పెకలించేస్తున్నారు. ఆ రోడ్ల స్థానంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఒడిశా అధికారులు చేపట్టారు. అంతేకాదు, ఆ గ్రామాల్లో కొన్ని శాశ్వత భవనాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది ఒడిశా సర్కార్. కొఠియా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని చూసిన ప్రతిసారీ ఆంధ్రా ప్రజాప్రతినిధులు, అధికారులకు చేదు అనుభవమే మిగలడం గమనార్హం.
సోమవారం నాడు జరగాల్సిన జగనన్న పచ్చతోరణం, సచివాలయ భవనాల నిర్మాణాల ప్రారంభం, విద్యాకానుకల పంపిణీ కార్యక్రమాలను మరోసారి ఒడిశా ఎమ్మెల్యేలు, నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆ గ్రామాల్లోని రహదారులను మూసేసి భారీగా బలగాలను ఒడిశా ప్రభుత్వం మోహరించింది. దీంతో, ఆ గ్రామాల్లోకి వెళ్లేందుకు ఏపీ అధికారులు, సిబ్బంది సాహసించడం లేదు. మరి, ఈ వ్యవహారంపై జగన్ ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.