ఆ వుడ్.. ఈ వుడ్ అన్న తేడా లేకుండా సినీ తారల పెళ్లిళ్లు జరుగుతుంటే.. ఇంకోవైపు ఇప్పటికే పెళ్లి చేసుకున్న తారలు వైవాహిక సంబంధం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి వచ్చేశారు బాలీవుడ్ సంచలన నటి.. వివాదాలతో తరచూ వార్తల్లోకి ఎక్కే రాఖీ సావంత్.
మోడల్ గా కెరీర్ షురూ చేసి.. డ్యాన్సర్ గా.. శృంగార గీతాల స్పెషలిస్టుగా సుపరిచితురాలైన రాఖీ సావంత్.. తనకు ఒక ఎన్నారైతో పెళ్లైందని ఆమె పలు సందర్భాల్లో చెప్పినప్పటికి ఆమె నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? అన్నది అర్థం కాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. గత ఏడాది బిగ్ బాస్ వేదిక మీద తన భర్త రితేష్ సింగ్ ను తొలిసారి అందరికి పరిచయం చేసిన రాఖీ.. మొత్తానికి తన పెళ్లైందన్నది నిజమేనని అందరికి అర్థమయ్యేలా చేశారు. ఇదిలా ఉంటే.. ప్రేమికుల దినోత్సవానికి కొన్ని గంటల ముందు ఆమె ఒక షాకింగ్ ప్రకటన చేశారు. వాలంటైన్స్ డే ముందు తాను చేస్తున్న ప్రకటన తనకు బాధను కలిగిస్తుందని చెబుతూనే.. తన భర్తతో విడిపోతున్నట్లుగా పేర్కొన్నారు.
తమ దారులు తాము చూసుకోవాలని నిర్ణయించుకున్నామని.. బిగ్ బాస్ షో తర్వాత తన జీవితంలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయని.. కొన్ని విషయాలు తనకు తెలీకుండానే తన చేజారిపోయినట్లుగా ఆమె చెప్పారు. తమ మధ్యన తలెత్తిన విభేదాలను తొలగించుకొని కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించినా కుదరలేదన్నారు.
చివరకు విడిపోవటమే మంచి మార్గమని తాను భావిస్తున్నట్లు చెప్పిన రాఖీ.. ఇకపై తన కెరీర్ మీద ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పారు. గుట్టుగా పెళ్లి చేసుకొని.. ప్రపంచానికి భర్తను పరిచయం చేసిన కొద్ది రోజులకే విడాకుల ప్రకటనను వెలువరించాల్సి రావటం గమనార్హం.