మరో ప్రముఖుడికి ఫైన్ పడింది. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం కలిగి ఉన్న కార్లకు వెనుకా ముందు చూడకుండా చలానాలు వడ్డిస్తున్న హైదరాబాద్ మహానగర పోలీసులు ఒక ఉద్యమంలా చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రూల్స్ ను బ్రేక్ చేసే వారు ఎవరైనా సరే.. ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కారుకు ఫైన్ వేశారు.
నిబంధనలకు భిన్నంగా కార్లకు ఏర్పాటు చేసిన బ్లాక్ ఫిలిం ఉన్న వాహనాలకు వరుస పెట్టి చలానాలు వేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా టౌలీచౌకిలో ఏపీ 39 హెచ్ వై 0319 వాహనం నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం కలిగి ఉందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు దాన్ని నిలిపారు. తీరా చూస్తే.. కారులో మంచు మనోజ్ ఉన్నారు. రూల్స్ కు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం ఉండటంతో అతడికి చలనా విధించారు. అంతేకాదు.. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావటం తెలిసిందే. ఓ వైపు బ్లాక్ ఫిలిం.. మరో వైపు వాహనాల మీద స్టిక్కర్ల ఏర్పాటును సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ కమిషనరేట్.. తమ పరిధిలోని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళుపుతున్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరికి చలానా విధించే విషయంలో అస్సలు తగ్గట్లేదు. పోలీసుల వాహనాలకు పోలీస్ అని ఉంటే.. ఆ వాహనాలకు సైతం చలానాలు విధిస్తున్నారు.