మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం కారణంగా ఏపీ బీజేపీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. తమకు జనసేన ఇంకా మిత్రపక్షమేనా అన్న విషయం కమలనాథులకు అర్థం కావటంలేదు. టెక్నికల్ గా బీజేపీ, జనసేన మిత్రపక్షాలు. కానీ పవనేమో టీడీపీతో కలిసి రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ కూడా బీజేపీ తమ మిత్రపక్షం అన్నట్లుగా వ్యవహరించటం లేదు. బీజేపీతో పొత్తులో ఉంటూనే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతామని ప్రకటించేశారు.
అప్పటినుండి కమలనాథుల్లో అయోమయం బాగా పెరిగిపోతోంది. అందుకనే బీజేపీ అద్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి ఎప్పుడు మాట్లాడినా జనసేన తమకు మిత్రపక్షమే అని చెబుతున్నారు. అయితే రెండుపార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం ఏమీలేదు. మరోవైపు తమ మిత్రపక్షం ప్రత్యర్ధి టీడీపీతో కలిసి ఎలా పనిచేస్తోందనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ విషయాన్ని పవన్నే అడగాలని సమాధానం దాటవేస్తున్నారు.
ఇక్కడ పవన్ రాజకీయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని. వైసీపీని ఓడించాలంటే బీజేపీతో ఉంటే సాధ్యం కాదు. కచ్చితంగా టీడీపీతో చేతులు కలిపితేనే వైసీపీని ఓడించగలమని పవన్ బలంగా నమ్ముతున్నారు. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీతో కటీఫ్ చెప్పారా అంటే అదీలేదు. పొత్తులో బీజేపీతో కంటిన్యూ అవుతూ ప్రత్యక్షంగా మాత్రం టీడీపీతో కలిసుంటున్నారు. పవన్ రాజకీయం కారణంగానే కమలనాథులకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.
రాష్ట్ర రాజకీయాలను, మూడు పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలను పురందేశ్వరి అంతర్గతంగా అధిష్టానానికి ఏమన్నా నివేదికలు ఇచ్చారా లేదా అన్నది తెలీదు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం ఏపీ రాజకీయాన్ని పట్టించుకుంటున్నట్లు కనబడటంలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని నరేంద్రమోడీ లేకపోతే అమిత్ షా ఇంతవరకు బహిరంగంగా ప్రకటించలేదు. అయితే వారి చర్యలు మాత్రం అలాంటి సంకేతాలనే పంపుతోంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తును తెంపుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా ఢిల్లీ పెద్దలు చోద్యం చూస్తున్నారంటే లోలోపల ఇంకేదో వ్యూహం ఉందనే అనిపిస్తోంది. అదేమిటో అంతుపట్టడంలేదంతే.