ఏపీ బీజేపీ నేతలు, ప్రత్యేకించి అధినేత సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలతో వేదిక పంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై రోజు విడివిడిగా విమర్శలు గుప్పించే వీర్రాజు వారితో విడివిడిగా వేదిక పంచుకోవాల్సి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరేందుకు ఇక్కడికి వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో కలిసి వీర్రాజు వచ్చారు.
మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సభకు ఆమె తొలుత హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మరిు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం వీర్రాజు, ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి విజయవాడలోని ఓ హోటల్లో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ కూడా ముర్ముకి తన మద్దతును ప్రకటించింది.
బీజేపీ నేతలు ముర్ముని అనుసరించి విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లి చంద్రబాబు నాయుడుతో వేదిక పంచుకున్నారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు సహా ఇతర టీడీపీ నేతలతో కలిసి ఆయన వేదికపై కూర్చోవలసి వచ్చింది.
2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడంతో అప్పటి నుంచి సోము వీర్రాజు టీడీపీపై తరచు మాట దాడిని తీవ్రంగా చేస్తున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకించడంలో వీర్రాజు ముందంజలో ఉన్నారు. అయితే, రాజకీయాల్లో ప్రతిదీ సాధ్యమే మరియు అధికార రాజకీయాల్లో శాశ్వత మిత్రులు మరియు శత్రువులు ఉండరు. అయినా టీడీపీ బీజేపీ పొత్తు వీర్రాజు కోరుకున్నంత మాత్రాన జరగదు. అడ్డుకున్నంత మాత్రాన ఆగదు. అది నిర్ణయం అయ్యేది మరెక్కడో !