తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకెళ్తోంటే బీజేపీ మాత్రం వెనక్కి వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచాల్సింది పోయి బీజేపీ నెమ్మదించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన బీఆర్ఎస్ రాజకీయ వేడిని రాజేసింది. మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తున్న కాంగ్రెస్.. గ్యారెంటీ హామీలతో పొలిటికల్ క్షేత్రంలో దూసుకెళ్తోంది. తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకులు హైదరాబాద్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలతో ప్రజల్లో కాంగ్రెస్కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వరుసగా మూడో సారి ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎన్నికల నాటికి మరిన్ని పథకాలు ప్రకటించే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. మరిన్ని కీలక వాగ్దానాలను కేసీఆర్ ప్రకటించే ఆస్కారముంది. ఇక హైదరాబాద్ లో ఈ నెల 17న విజయభేరి పేరుతో నిర్వహించిన సభ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సభలో సోనియా, రాహుల్ గాంధీ ఆరు ప్రధాన హామీలు ప్రకటించారు. ఈ గ్యారెంటీ హామీలతో కార్డులను రూపొందించి ప్రజలకు కాంగ్రెస్ పంచుతోంది. కర్ణాటక తరహాలో ఈ హామీలు తెలంగాణలోనూ తమను గెలిపిస్తాయనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.
కానీ బీజేపీ పరిస్థితి మాత్రం అయోమయంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేననే భావనను ప్రజల్లోకి కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హామీలను ప్రకటించడంలోనూ తాత్సారం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర నేతలు అనుకుంటున్నారని తెలిసింది. అధిష్ఠానం ఆదేశాలు లేనిదే.. ఇతర పార్టీల్లాగా హామీలు ఇవ్వడానికి బీజేపీ నాయకులకు స్వేచ్ఛ లేదు. ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం. కాబట్టి మ్యానిఫెస్టో కోసం ఢిల్లీ వైపు చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందనే చెప్పాలి. మరోవైపు ఈ పదేళ్లుగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందే లేదని టాక్ ఉంది. ఇప్పుడు ఎన్నికల ముందు ఇది చేస్తాం.. అది చేస్తాం అంటే ప్రజలు బీజేపీని నమ్ముతారా? అన్నది మరో ప్రశ్న.