దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ హర్యానాలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అంపశయ్య మీదకు చేరింది. అక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ లో చేరడంతో అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయబ్ సింగ్ సైనికి షాక్ తగిలింది.
హర్యానా శాసనసభలో మొత్తం 90 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 46 మంది సభ్యుల మద్దతు కావాలి. సైనీ ప్రభుత్వం 47 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ముగ్గురు మద్దతు ఉపసంహరించుకోవడంతో 44 మంది సభ్యులకు పడిపోయింది.
హర్యానాలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ 30
జననాయక్ జనతా పార్టీకి 10, స్వతంత్రులు 7, హర్యానా లోక్ హిత్ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలకు ఒకరు చొప్పున సభ్యులున్నారు.
ప్రభుత్వం కొనసాగాలి అంటే బీజేపీకి మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో సైనీ ప్రభుత్వానికి గవర్నర్ 10 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పది రోజులలో ఇద్దరి మద్దతు కూడగట్టుకోగలిగితే ప్రభుత్వం నిలబడుతుంది.