టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బాబు అరెస్డు, రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా తాము బాబుతోనే అంటూ వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు అరెస్టును వివిధ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు అరెస్టుపై స్పందిస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు.. తమకు ప్రయోజనం కలిగే విధంగా వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని చెప్పాలి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన బాబు రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ అరెస్టు వెనుక బీజేపీ లేదని నొక్కి చెప్పారు. ఇక అటు ఏపీ, ఇటు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇప్పటికే బాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని ఖండించేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు.
మరోవైపు తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరో వాదన చేస్తున్నారు. బాబు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందని గట్టిగా చెబుతున్నారు. బీజేపీ అండ చూసుకునే జగన్ రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ చెప్పేది మరొకలా ఉంది. బాబు అరెస్టు అనేది మోదీ, జగన్, కేసీఆర్ చేసిన కుట్ర అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీన్ని నిరూపించేందుకు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఇప్పటివరకూ బాబు అరెస్టు వెనుక కేంద్రం పాత్ర ఉందనే వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి.