సార్వత్రిక ఎన్నిల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల ముందు వరకు జగన్‌కు జై కొట్టిన నాయకులు.. ఇప్పుడు తాము వైసీపీలో ఉండలేమంటూ పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రుల్లో చాలా మంది ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ జాబితాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన బాలినేని జగన్‌కి అత్యంత ఆప్తుడు మరియు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి బావ అవుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1999 నుండి 2012 వరకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన బాలినేని.. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు చేతిలో ఓడిపోయారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌పై మరోసారి పోటీ చేసి బాలినేని..విజయం సాధించారు. వైసీపీ హయాంలో తొలి రెండున్నర ఏళ్లు ఇంధనం, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ నచ్చజెప్పడంతో పార్టీలో బాలినేని మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న బాలినేని శ్రీనివాస్.. ప్రస్తుతం వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఇటీవల బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారట. పార్టీని వీడొద్దని.. మళ్లీ మనం అధికారంలోకి వస్తామని బుజ్జగించే ప్రయత్నం చేశారట. కానీ జగన్ బుజ్జగింపులు ఫలించలేదని.. వైసీపీకి రేపో మాపో బాలినేని శ్రీనివాస్ రాజీనాయా చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వైసీపీని వీడాక బాలినేని దారి జనసేన వైపే అని బలంగా టాక్ వినిపిస్తోంది.