ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఇటు అమరావతి రైతులు మొదలు…అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు కూడా తమ వంతు సహకారమందించారు. కానీ, అనూహ్యంగా అమరావతిలో కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నిర్వహిస్తానంటూ జగన్ చెప్పడంతో అమరావతి కోసం త్యాగం చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారిందని టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, అమరావతి రాజధాని వ్యవహారం తెలంగాణవాదిగా సంతోషం కలిగించినా..భారత పౌరుడిగా బాధ కలిగించిందని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే తనకు ఇష్టమని చెప్పిన రేవంత్…తాను కాంగ్రెస్ కు విధేయుడనని చెప్పారు. ఈ క్రమంలోనే రేవంత్ పై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి ఓ క్యారెక్టర్ లెస్ ఫెలో అని, ఎవరో ఏదో చెబితే.. రేవంత్ రెడ్డి అది చేస్తాడని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాదని..టీడీపీ అని, చంద్రబాబు ఏం చెబితే అదే రేవంత్ చెబుతారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఓ పార్టీ అంటూ ఏమీ లేదని, రేవంత్ రెడ్డికి అమరావతి గురించి ఎందుకని బాలినేని ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో అక్కడ రాజధాని ఏర్పాటుకు నిర్ణయించామని అన్నారు.
జాతీయ స్థాయి పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ అధినేత ఇష్టమని చెప్పడం రేవంత్ క్యారెక్టర్ అని బాలినేని విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయ నాయకులను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మరి, బాలినేని వ్యాఖ్యలకు రేవంత్ స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.