రెండో రోజు శాసనసభ సమావేశాల సందర్భంగా కూడా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మొదటి రోజు మాదిరిగానే రెండో రోజు కూడా టిడిపి సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో, చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబడుతూ టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూర్చునే సీటుపైకి ఎక్కి ఈల వేసి బాలకృష్ణ తన నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి సభ్యులు చర్చకు పట్టు బట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను స్పీకర్ తమ్మినేని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణ, నిమ్మల రామానాయుడులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ సెషన్ మొత్తానికి హాజరు కాకూడదని టీడీపీ సభ్యులంతా నిర్ణయించామని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారని, చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు స్పీకర్ అనుమతినివ్వడం లేదని అచ్చెన్న ఆరోపించారు. అందుకే, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
యూజ్లెస్ ఫెలోస్ అంటూ స్పీకర్ టిడిపి సభ్యులను అవమానించారని, తమకు అవకాశం ఇవ్వకుండా కూర్చోండి అంటూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారన్న విషయాన్ని తమ్మినేని మర్చిపోయారని, అసెంబ్లీ సమావేశాలను వైసీపీ సమావేశాలుగా మార్చేశారని ఆరోపించారు. అధికార పక్షానికి వంతపాడుతున్న తమ్మినేని …టిడిపి ఎమ్మెల్యేలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలకు కూడా శనివారం నుంచి టీడీపీ సభ్యులు హాజరు కావడం లేదని ప్రకటించారు. పార్టీలోని సభ్యులందరితో కలిపి చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.