హీరోలు దర్శకులు కావడం కొత్తేమీ కాదు. ముందు తరం సూపర్ స్టార్లలో ఎన్టీఆర్, కృష్ణ రెండంకెల సంఖ్యలో సినిమాలు డైరెక్ట్ చేశారు. ఐతే వీరి తర్వాతి తరం సూపర్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటిదాకా ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు.
ఐతే నందమూరి బాలకృష్ణ రెండు దశాబ్దాల కిందట ‘నర్తనశాల’ సినిమాను స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేద్దామని చూశారు. కానీ సినిమా మొదలైన కొన్ని రోజులకే సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ పాత్రకు రీప్లేస్మెంట్ లేదనో, ఆమె మరణాన్ని అశుభ సూచకంగా భావించో ఈ సినిమాను ఆపేశాడు బాలయ్య.
మళ్లీ ఎప్పుడూ దర్శకత్వం ఊసు ఎత్తని బాలయ్య ఇప్పుడు మెగా ఫోన్ పట్టేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. ‘ఆదిత్య 369’ సీక్వెల్.. ‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ను స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని బాలయ్య బావిస్తున్నాడు.
ముందు బాలయ్య ఈ విషయం చెబితే ఏదో మాట వరసకి అన్నాడేమో, అది నిజం అయినపుడు చూద్దాం అనుకున్నారు అభిమానులు. కానీ తాజాగా ‘ధమ్కీ’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాదే తన దర్శకత్వంలో ‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి ఈ సినిమా తీసే విషయంలో బాలయ్య గట్టిగానే ఫిక్సయ్యాడన్నది స్పష్టం. కానీ ‘ఆదిత్య 369’ అనేది కల్ట్, క్లాసిక్ మూవీ. అదెంత కాంప్లికేటెడ్‌గా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చూసినా ఫ్రెష్ అనిపించేలా.. అప్పటి కాలం నుంచి చాలా ముందుకు వచ్చి తీశారు సింగీతం శ్రీనివాసరావు.
ఇలాంటి సినిమాలను ఆషామాషీ దర్శకులెవరూ తీయలేరు. సీక్వెల్ కోసం స్టోరీ బోర్డ్‌తో సహా స్క్రిప్టు రెడీ చేశారు సింగీతం. కాకపోతే ఇప్పుడాయనకు వయసు మీద పడింది. ఆయన చివరగా తీసిన సినిమాలు చూస్తే ఔట్ డేట్ అయిపోయారన్నది స్పష్టం.
అలా అని దర్శకత్వంలో అనుభవం లేని, తాను చేసే వాటిలో ఊర మాస్ చిత్రాలకే పెద్ద పీట వేసే బాలయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే దానికి న్యాయం చేయగలడా అన్నది డౌటు. మంచి విషయం ఉన్న, ట్రెండీ డైరెక్టర్‌ను పెట్టుకోకుండా బాలయ్య ఇంత ధైర్యం చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.