టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై రాష్ట్రం అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పలు ఆందోళన కార్యక్రమాలు, నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టుపై ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేయడాన్ని బాలకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా జగన్ పై బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 నెలలపాటు జైల్లో ఉన్న జగన్ కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబును జైల్లో ఉంచాలన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్లుగా అదును కోసం చూస్తున్నారని, చంద్రబాబును అరెస్ట్ చేయించడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా జగన్ ప్రవర్తిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రజలను పాలించేందుకు కాకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకే జగన్ అధికారాన్ని చేపట్టారని బాలయ్య దుయ్యబబట్టారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ పొలిటిషన్ ను అర్ధరాత్రి అమానుషంగా అరెస్ట్ చేయడాన్ని దుయ్యబట్టారు. సీఎం జగన్ అన్నం తినడం మానేశారని, కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని బాలయ్య ప్రశ్నించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఒక ప్రచారమేని, అందులో వాస్తవం లేదని అన్నారు.
2021 డిసెంబర్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇప్పటివరకు ఎందుకు చార్జిషీట్ ఫైల్ చేయలేదని ప్రశ్నించారు. ఇటువంటి అక్రమ కేసులకు అరెస్టులకు భయపడబోమని, కచ్చితంగా న్యాయపోరాటం చేసి తీరుతామని అన్నారు. డిజైన్ టెక్ సంస్థ ఖాతాలు ఫ్రీజ్ చేసినప్పుడు కోర్టు చివాట్లు పెట్టిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని కోర్టు ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని బాలయ్య బాబు ప్రశ్నించారు. 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చి 72వేల మందికి ఉద్యోగాలు కల్పించారని, అది కుంభకోణం ఎలా అవుతుందని హైకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని బాలయ్య గుర్తు చేశారు.