అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై 7 నుంచి 9 వరకు తానా (TANA) 23వ సభలు జరగుతున్న సంగతి తెలిసిందే. తానా సభల అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ ఛైర్మన్ శ్రీనివాస్ లావుల ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సభలకు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో బాలకృష్ణ , వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర, మాజీ ఎంపీ మురళీ మోహన్ తదితరులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే తానా సభలలో బాలయ్య బాబు ప్రసంగించారు. తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ సత్తా చాటుతున్నారని బాలయ్య అన్నారు. తానా సభలలో మహానటుడు ఎన్టీఆర్ కు నివాళి అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్యాన్సర్ క్యాంపులు నిర్వహించడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం గొప్ప విషయం అని ఎన్నారైలను బాలయ్య కొనియాడారు.