ఏపీ మాజీ మంత్రి, దాదాపు 17 రోజులుగా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న భూమా అఖిల ప్రియకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హఫీజ్ పేట భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావు.. సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేశారనే నేరంపై అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నేత, భూమా కుటుంబానికి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మొత్తం కిడ్నాప్ ఘటనకు కూడా ప్లాన్ సహా.. ముందస్తు ఏర్పాట్లు చేసిన భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు ఏ1గా నిర్ధారించారు.
ఈ క్రమంలోనే ఈ నెల 5న ఆమెను హైదరాబాద్‌లోనే అరెస్టు చేసి.. అటునుంచి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. అదేసమయంలో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా! ఇక, ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటికీ అఖిల భర్త భార్గవ్ రామ్ పట్టుబడాల్సి ఉంది. ఇదిలావుంటే.. బెయిల్ కోసం అఖిల ప్రియ చేసుకున్న పిటిషన్‌పై ఎట్టకేలకు కోర్టు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ. 10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
అయితే.. అఖిల ప్రియ శనివారం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, షరతుల విషయంలో పూర్తి తీర్పు రావాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక, అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వవద్దని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. అయితే.. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడం, కేసు ప్రభావంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్న అఖిల ప్రియ తరఫున్యాయ వాదుల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. చిన్నపాటి షరతులతోనే బెయిల్ మంజూరు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక, ఈ బెయిల్ విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందా? కర్నూలులో రాజకీయంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉందా? పాస్ పోర్టు తదితర అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు.