తెలంగాణలో బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ కార్యకర్తపై బాబూ మోహన్ బూతు పురాణం ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు ఫోన్ చేసిన కార్యకర్తపై ఆయన ఓ రేంజ్ లో విరుచుకుపడిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘చెప్పు తమ్ముడూ’ అంటూ మొదలెట్టిన బాబూ మోహన్ చివరకు బూతుల పంచాంగంతో ముగించారు.
అందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ…బాబు మోహన్ కు ఫోన్ మీతో కలిసి పనిచేస్తానని అన్నారు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన బాబూ మోహన్..అసలు నువ్వెవడివి? నువ్వెంత? నీ బతుకెంత? అంటూ ఫైర్ అయ్యారు. తాను ప్రపంచస్ధాయి నాయకుడని, అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తానని నిప్పులు చెరిగారు. తాను కావాలో…అతడు కావాలో పార్టీ తేల్చుకుంటుందంటూ మండిపడ్డారు.
బండి సంజయ్ పేరును వెంకటరమణ ప్రస్తావించగా..‘‘బండి సంజయ్ ఎవడ్రా?.. వాడు నా తమ్ముడు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఇంకోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానంటూ వెంకటరమణకు బాబూ మోహన్ వార్నింగ్ ఇచ్చారు. ఓ బీజేపీ కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదేనా? తాను ఎంతో కాలం నుంచి బీజేపీలో కష్టపడుతున్నాఅని వెంకటరమణ చెప్పేందుకు ప్రయత్నించినా బాబూ మోహన్ వినలేదు.
నీ వయస్సు ఎంత? జోగిపేటకు నువ్వేం చేయగలవు? నీకు ఎన్ని ఓట్లు? నీ స్థాయి ఎంత? నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి…అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు, కావాలంటే ఈ ఫోన్ కాల్ రికార్డు చేసుకోవాలని, ఇంకోసారి ఫోన్ చేస్తే బాగోదని హెచ్చరించారు. ప్రస్తుతం బాబూ మోహన్ బూతు పురాణం ఆడియో క్లిప్ వైరల్ అయింది.