మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి ఆ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా తొలగించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో జగన్, సంచయిత గజపతి రాజు, విజయసాయిరెడ్డిలపై అశోక గజపతిరాజుదే పైచేయిగా ఉంది. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడం జగన్ అండ్ కోకు మింగుడుపడడం లేదు.
దీంతో, అశోక్ గజపతి రాజును ఇబ్బది పెట్టేందుకు జగన్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపించేందుకు కుట్ర జరుగుతోందని, మాన్సాస్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని అడిగినందుకు తనపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుండి కూడా సిబ్బందికి జీతాలివ్వకపోవడం దారుణమని, అదే విషయాన్ని నిలదీస్తే తనపై కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీతాలివ్వమని అడిగిన పాపానికి తనపై ఓ ఈవో కేసు పెట్టారని, తాను కోర్టుకు వెళ్తే జీతాలు ఇవ్వమని ఆదేశించారని చెప్పారు. అయితే, ఆ ఈవోపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అశోక్ గజపతి రాజు విమర్శించారు. భూ అక్రమాలపై సర్వేలతో సహా వివరాలు ఇవ్వమని అడిగానని, కానీ తనకు ఇవ్వలేదని చెప్పారు. తనపై ఓ సీక్రేట్ రీసెర్చ్ జరుగుతోందని, తనపై కొందరు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
తాను కెమెరాలు పెట్టలేదని పదవి నుంచి తొలగించారని, దేవాలయాల డబ్బులు ప్రభుత్వం తీసుకుని.. తనను కెమెరాలు పెట్టమనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. వాహనమిత్ర కార్యక్రమానికి దేవాదాయ శాఖ నిధులు వాడటమేంటని నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. 150కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థం ఘటనపై చర్యలు తీసుకోకుండా రాజకీయం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాలు అన్ని మతాలను గౌరవించాలని అశోక్ గజపతి రాజు హితవు పలికారు.