జగన్ పై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడుగా ఉన్న వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. “సీఎం జగన్ కారణంగా నేను, నా కుటుంబం మేలు పొందాం. నాకు పదవి కూడా ఇచ్చారు. కానీ, ఆయన అరాచకం చూస్తే నాకు నిద్రపట్టడం లేదు. పదవి ఇచ్చారని చూస్తూ ఉండలేను. జగన్ పాలనలో నరహంతకులకు, ముఖ్యంగా ఎస్సీ హంతకులకు పెద్దపీట వేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా“ అని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు, మాల సామాజిక వర్గానికి చెందిన సోనీ ఉడ్ వ్యాఖ్యానించారు.
తాజాగా సోనీ ఉడ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిలో ఆయన డాక్టర్ సుధాకర్ పై పోలీసులు జరిపిన దారుణం నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను మర్డర్ చేసి బాడీని డోర్ డెలివరీ చేయడం వరకు అనేక విషయాలను పంచుకున్నారు. దళితులపై వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులను ఆయన పూస గుచ్చినట్టు వివరించారు. ఇదేసమయంలో జగన్ తనకు, తన కుటుంబానికీ మేలు చేశారని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదీ వీడియో సారాంశం..
+ కాకినాడలో దళిత డ్రైవర్ హత్య, తొండంగిలో దళిత యువకుడి హత్య, మల్లవరంలో పాలిటెక్నిక్ విద్యార్ధి హత్య వెనుక ముగ్గురు నిందితులు వైసీపీ వారే.
+ డబ్బులు, అధికారం ఉంటే హత్యలు చేసి బయట తిరగొచ్చా?.. రాజకీయ పార్టీ ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్లను కాపాడవచ్చా?
+ కొద్దిరోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు. కుటుంబసభ్యులతో చర్చించాకే ఈ వీడియో చేశా.
+ ఇది నా జీవితాన్ని రిస్క్ లో పెట్టేదే. అయినా సరే జగన్ను ప్రశ్నిస్తున్నా.
+ హత్య కేసుల్లో ఏ1గా(ఎమ్మెల్సీ అనంతబాబు) ఉన్నవాడు పార్టీ కార్యకలాపాల్లో ఎంత వరకు పాల్గొనవచ్చు?
+ సమాజంలో తక్కువ కులాల వారికి భద్రత ఏమిటి?
+ చనిపోయిన వారిని తిరిగి తీసుకురండి అని అడగడం లేదు. చంపేసిన వాళ్లను శిక్షించండి జైలుకు పంపండి.
+ రేపు ఇంకొకరి హత్య జరగదు అని నమ్మకం ఏమిటి?
+ ప్రాణాల్ని కాపాడతామని ప్రభుత్వ పరంగా ఏ రకంగా హామీ ఇవ్వగలదు?
+ హత్యలు చేసిన వాళ్ళను పార్టీల్లో క్రియాశీలకంగా లేకుండా చేసి.. తీవ్రమైన సంకేతం ఇవ్వలేక మీ నుంచి పేదలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
+ అంబేడ్కర్ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారు.
+ శృంగ వృక్షంలో జరిగిన హత్య తర్వాత తునిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారనే విషయాన్ని మరచి పోకూడదు.
+ రాము చనిపోవడం వల్ల దళితుల్లో వ్యతిరేకత వస్తుందనే వాదనతో వారిపై ప్రేమ చూపించుకోవడానికి విగ్రహం పెట్టారు.
+ నా కుటుంబానికి సీఎం జగన్ మేలు చేశారు. లాభం పొందానని నేను నోరు మూసుకుని ఉంటే స్వార్థపరుడిని అవుతాను.