ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రయత్నిస్తుండగా…వాయిదా వేసేందుకు ప్రభుత్వం, అధికారులు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల పంచాయతీ కోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు, కరోనా నేపథ్యంలో తాము ఎన్నికల విధులు నిర్వహించబోమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. పీపీఈ కిట్లు అందిస్తామని, ఉద్యోగుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం జరిగింది.
ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజులపాటు సెలవులపై వెళ్లడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ఆయన ప్రభావితం చేశారని అభియోగాలు రావడంతో ఎస్ఈసీ క్రమశిక్షణారాహిత్యం కింద పరిగణించింది. దీంతో, ఎన్నికలకు విఘాతం కలిగించేలా ప్రసాద్ చర్యలున్నాయని భావించిన ఎస్ఈసీ…ఆయనపై చర్యలు తీసుకుంది. జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రసాద్ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ తేల్చి చెప్పింది.