జగన్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళలపై భౌతిక దాడుల నేరాలు అదుపులోకి రాకపోవడం కలవరపరుస్తోంది. విజయవాడలో మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన, నెల్లూరులో భూకబ్జాను అడ్డుకున్న మహిళపై వైసీపీ నేత నిర్వాకం ఘటనల సద్దుమణగక ముందే జగన్ సర్కార్ కు సంబంధించిన షాకింగ్ నివేదిక ఒకటి వెల్లడి కావడం సంచలనం రేపుతోంది.
పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) షాకింగ్ నివేదికను వెల్లడించింది. క్రైమ్ ఇన్ ఇండియా-2020 జాబితాలో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా…జగన్ పాలనలోని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ లో 72 కేసులు నమోదు కాగా, ఏపీలో 70 కేసులు నమోదయ్యాయి. పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం, స్త్రీలను రహస్యంగా చిత్రీకరించటం (వోయిరిజం) వంటి నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.
ఇఖ, 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది వివరాలు షాకింగ్ గా మారాయి. ఏపీలో మొత్తంగా మహిళలపై అన్ని రకాల నేరాలు కలిపి 2019లో 17,746, 2020లో 17,089 జరిగాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాల జాబితాలో 2019లో పదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2020లో ఎనిమిదో స్థానానికి ఎగబాకడం బాధాకరం.
ఈ నివేదిక నేపథ్యంలో జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా’ అని ఆయన నిలదీశారు. ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు, దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమని అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల్లో ఏపీ 2వ స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని మండిపడ్డారు.